AP Panchayat Elections : ట్రెండ్ మారింది బాస్.. ఎన్నికల ప్రచారంలో కొత్త ట్రెండ్?
AP Panchayat Elections : ఎక్కడైనా సరే.. ఎన్నికలు అంటేనే హడావుడి ఎక్కువగా ఉంటుంది. పోటీ చేసే అభ్యర్థులు, ప్రచారాలు, ఎన్నికల హామీలు, మద్యం, డబ్బులు వరదలై పారడం.. ఇలా ఎన్నికలు అంటేనే ఇవన్నీ తెగ సందడి చేస్తాయి. ఏ ఊళ్లో అయినా ఎన్నికలు ఉంటే.. అవి ముగిసే వరకు ఆ ఊళ్లో పెద్ద జాతరే జరుగుతుంది.
అయితే.. ఇన్ని రోజులు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల్లో ప్రచారం కోసం ఒకే పద్ధతిని అవలంభించేవారు. మామూలుగా ఇంటింటికి తిరిగి.. ప్రచారం చేయడం.. పోస్టర్లు, బ్యానర్లు కట్టడం, మరీ అడ్వాన్స్ డ్ అంటే ఫోన్ చేసి ఓటేయాలంటూ కోరడం లాంటివి చేసేవారు.
కానీ.. తాజాగా ఏపీలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులు ప్రచారం కోసం ఏం చేస్తున్నారో తెలిస్తే మీరు అవాక్కవుతారు. ట్రెండ్ మారింది బాస్.. ఇప్పుడంతా సోషల్ మీడియానే అంటూ సరికొత్త పద్ధతిలో ప్రచారాన్ని మొదలు పెట్టారు.
ఇప్పటికే ఏపీలో మొదటి, రెండో విడత పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యాయి. రెండు విడతల ఎన్నికలకు అభ్యర్థులు సోషల్ మీడియానే ఉపయోగించుకున్నారట. కొందరు అభ్యర్థులు కేవలం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ప్రచారం చేసి గెలిచిన సందర్భాలు కూడా ఉన్నాయట.
ఇప్పుడు అంతా స్మార్ట్ ఫోన్ల యుగం. ఎక్కడ చూసినా.. వాట్సప్, ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్. జనాలు ఎక్కువగా వీటితోనే గడుపుతుండటంతో వీటినే తమ ప్రచారాస్త్రాలుగా ఉపయోగించుకొని సక్సెస్ అయ్యారు.
AP Panchayat Elections : స్మార్ట్ ఫార్ములా సక్సెస్ లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ల పాత్ర అద్భుతం
అయితే.. పంచాయతీ ఎన్నికల్లో సోషల్ మీడియా అస్త్రాన్ని ఉపయోగించి సక్సెస్ అయ్యేలా చేయడంలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు ప్రధాన పాత్ర పోషించారు. ఎందుకంటే.. కరోనా కారణంగా దాదాపు సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు అంతా ఇంటి నుంచే పని చేస్తున్నారు. అందరూ తమ సొంత గ్రామాలకు వెళ్లి.. అక్కడే పని చేస్తుండటం, ఇదే సమయంలో ఎన్నికలు రావడంతో చాలామంది సాఫ్ట్ వేర్లు ఎన్నికల్లో పోటీ చేశారు. ఇక.. తమ ప్రచారాస్త్రాలుగా తమకు తెలిసిన సోషల్ మీడియాను ఉపయోగించుకుంటున్నారు. వీళ్లను చూసి.. మిగితా అభ్యర్థులు కూడా సోషల్ మీడియాలో ప్రచారం చేసి సక్సెస్ అవుతున్నారు.