Prakasham..రైతుల కోసమే ‘పొలంబడి’..
‘పొలంబడి’ కార్యక్రమం ద్వారా రైతులకు పంటసాగులో నూతన విధానాలు తెలుపుతున్నట్లు కందుకూరు వ్యవసాయ అసిస్టెంట్ డైరెక్టర్ శేషగిరి తెలిపారు. జిల్లాలోని గుడ్లూరులో జరిగిన ‘పొలంబడి’ శిక్షణా కార్యక్రమంలో శేషగిరి వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన గ్రామ వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. పొలంబడి ప్రోగ్రాంలో రైతులుకు వివిధ విషయాలపై అవగాహన కల్పించాలని చెప్పారు.
రైతుల సందేహాలు నివత్తి చేయాలని, వారికి అవసరమైన పలు సూచనలు చేయాలని తెలిపారు. ఇకపోతే వివిధ పంటలలో తరచూ కనపించి ఫార్మర్స్‌కు తీవ్ర నష్టం కలిగిస్తున్న లద్దెపురుగు నివారణకుగాను విషపు ఎరను వినియోగించాలని, తద్వారా చక్కటి ఫలితాలు ఉంటాయని శేషగిరి పేర్కొన్నారు. వ్యవసాయంలో వినూత్న పద్ధతులకు శ్రీకారం చుట్టాలని రైతులకు సూచించాలని, అందుకు అవసరమైన సలహాలు, సూచనలు వ్యవసాయ శాఖ అధికారుల నుంచి తీసుకోవాలన్నారు. ఇకపోతే ఇటీవల కాలంలో వ్యవసాయంలో యంత్రాల వినియోగం బాగా పెరిగిందని చెప్పారు. కార్యక్రమంలో ఒంగోలు భూసార పరీక్షా కేంద్రం ఏడీ నిర్మలాకుమారి, వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.