Telangana : సమగ్ర కుటుంబ సర్వే : వివరాల నమోదుకు సొంతూరు వెళ్లాల్సిన అవసరం ఉందా.. లేదా..?
ప్రధానాంశాలు:
Telangana : సమగ్ర కుటుంబ సర్వే : వివరాల నమోదుకు సొంతూరు వెళ్లాల్సిన అవసరం ఉందా.. లేదా..?
Telangana : తెలంగాణలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమాచార సేకరణకు ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే చేపట్టిన సంగతి తెలిసిందే. నవంబర్ 6 నుంచి 30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగనుంది. ఇప్పటికే మూడు రోజుల పాటు ఇండ్ల జాబితా నమోదు (హౌస్‌లిస్టింగ్) కార్యక్రమం చేపట్టారు. గ్రామ పంచాయతీ/ మున్సిపాలిటీ పరిధిలోని గ్రామం (ఆవాసం) పేర్లను కోడ్ రూపంలో సేకరించారు. వార్డు నంబర్, ఇంటి నంబర్, వీధి పేరు హౌస్ లిస్టింగ్‌లో నమోదు చేసి ప్రతి ఇంటికి స్టిక్కర్ అంటించారు.తెలంగాణలో మొత్తం 1,17,44,954 కుటుంబాలు ఉన్నాయని అధికారులు గుర్తించారు. అందుకు అనుగుణంగా 87,092 ఎన్యూమరేషన్ బ్లాక్‌లుగా విభజించి వారికి సర్వే బాధ్యతలు అప్పగించారు.
ఒక్కో ఎన్యూమరేటర్ 150 నుంచి 175 ఇళ్ల దాకా కేటాయించడంతో వీటి నంబర్ల నమోదు పూర్తి చేశారు. ఇక స్టిక్కరింగ్ అయిపోవటంతో నేటి రెండో దశ సమగ్ర కుటుంబ సర్వే ప్రారంభం కానుంది. కుటుంబ వ్యక్తిగత వివరాలను ఎన్యూమరేటర్లు సేకరిస్తారు. ప్రతి ఇంటికీ వెళ్లి ప్రతి కుటుంబంలోని సభ్యులందరి సమగ్ర వివరాలను నమోదు చేస్తారు.
అయితే వృత్తి, వ్యాపారం, ఉద్యోగాల కోసం స్వగ్రామాలను వదిలి చాలా మంది దూర ప్రాంతాల్లోని పట్టణాలు, నగరాల్లో వలస వెళ్లారు. ఆధార్ కార్డులో అడ్రస్ ఉన్న చోటికి, సొంతింటికి, స్వగ్రామానికి వెళితేనే కుటుంబ వివరాలు నమోదు చేస్తారనే ప్రచారం జరుగుతుంది. దీంతో సమగ్ర కుటుంబ సర్వే కోసం ఇతర ప్రాంతాల్లో నివాసం ఉండేవారంతా స్వగ్రామాలకు వెళ్లాలా వద్దా అనే డైలమాలో పడ్డారు. అయితే వారు ఉన్నచోటునే వివరాలను వెళ్లడిస్తే సరిపోతుందని ప్రణాళిక శాఖ స్పష్టం చేసింది. ఆధార్ కార్డులో ఉన్న వివరాల ఆధారంగానే సర్వే జరుగుతుందని తెలిపింది. అంతేకాకుండా ఎన్యూమరేటర్లు ప్రతి ఇంటికి వస్తారని వారు అడిగిన వివరాలు చెబితే సరిపోతుందని చెప్పింది.
ముఖ్యంగా ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పాస్ బుక్, సెల్ ఫోన్ నంబర్ల లాంటివి అందుబాటులో ఉంచాలని సూచించింది. ఎన్యూమరేటర్లు వచ్చే సమయానికి ఇబ్బంది పడకుండా ముందుగానే కాగితాలను సిద్దం చేసుకుంటే వివరాలు కూడా సులభంగా చెప్పొచ్చని స్పష్టం చేసింది. సర్వే పూర్తి కాగానే కుటుంబ సభ్యులు అన్ని వివరాలు సరైనవే అని ఒక సంతకం చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం చేపడుతున్న ఈ సర్వే ఆధారంగా కులాల వారిగా రిజర్వేషన్ల మార్పు, ప్రభుత్వ పథకాలు లబ్దిదారులకే అందజేత లాంటి కీలక నిర్ణయాలను ప్రభుత్వం తీసుకునే అవకాశం ఉంది.