కీలక పరిశ్రమకు నిధులు విడుదల చేసిన ఏపీ సీఎం జగన్
కొవిడ్ కట్టడికి విధించిన లాక్ డౌన్, ఆ తర్వాత కాలంలో చిన్న, మధ్య తరగతి పరిశ్రమలు బాగా నష్టపోయిన సంగతి అందరికీ విదితమే. కాగా, ఇప్పుడిప్పుడే ఆయా పరిశ్రమలు కోలుకుంటుండగా, ఏపీలో ఆ పరిశ్రమలకు సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహకంగా నిధులు విడుదల చేశారు. మైక్రో స్మాల్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ అయినటువంటి స్పిన్నింగ్, టెక్స్‌టైల్ ఇండస్ట్రీస్‌కు రూ.1,124 కోట్లు ఇచ్చారు. తన క్యాంపు కార్యాలయం నుంచి ఏపీ సీఎం జగన్ నిధులు విడుదల చేసిన అనంతరం మాట్లాడుతూ చిన్న తరహా పరిశ్రమలను ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకొచ్చిందని తెలిపారు. ఈ ఎంఎస్ఎంఈల ద్వారా సుమారు పది లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పారు.
ఏపీ అభివృద్ధికిగాను వైసీపీ ప్రభుత్వం కమిట్‌మెంట్‌తో పని చేస్తున్నదని, రాష్ట్రానికి ఇండస్ట్రీస్ తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. రూ. పదివేల కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా కొప్పర్తిలో వైఎస్‌ఆర్ ఈఎంసీ పార్క్ ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి వివరించారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన ఈ రెండున్నరేళ్లలో ఏపీలో 68 మెగా, భారీ ఇండస్ట్రీస్ ఏర్పాటు అయ్యాయని వివరించారు. భావనపాడు, మచిలీపట్నం, రామాయపట్నంలో గ్రీన్‌ఫీల్డ్ పోర్టులను ఏర్పాటు చేస్తామని, మరో 9 కొత్త ఫిషింగ్ హార్బర్‌లను ఏర్పాటు చేయబోతున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. ఇండస్ట్రీస్‌కు ఇస్తున్న ప్రోత్సాహకాల్లో ఏపీకి జాతీయ స్థాయిలో ఫస్ట్ ప్లేస్ వచ్చిందని సీఎం జగన్ తెలిపారు.