Chittor.. ఎనిమిదేళ్లకే కుటుంబ భారం.. నెట్టుకొస్తున్న బాలుడు
సాధారణం ఎనిమిదేళ్ల పిల్లాడు ఎవరైనా ఏం చేస్తాడు.. హాయిగా తోటి స్నేహితులతో ఆడుకుంటూ సరదాగా గడుపుతుంటాడు. కానీ, ఈ బాలుడు మాత్రం అలా కాదండోయ్.. ఎనిమిదేళ్లకే కుటుంబ భారం మీదేసుకున్నాడు. వివరాల్లోకెళితే.. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండల పరిధిలోని గంగుడుపల్లి గ్రామానికి చెందిన బండి పాపిరెడ్డికి వెదురుకుప్పం మండలం మాంబేడు గ్రామానికి చెందిన రేవతితో పదేళ్ల కిందట మ్యారేజ్ అయింది. వీరికి గోపాలకృష్ణారెడ్డి, హిమవంతురెడ్డి, గణపతిరెడ్డి ముగ్గురు పిల్లలు. అయితే, పాపిరెడ్డికి చిన్నతనంలోనే కంటిచూపు పోయింది. ఇక రేవతి పుట్టుకతోనే అంధురాలు.
సర్కారు అందించే పింఛన్‌పైనే ఆధారపడి వీరు జీవనం సాగిస్తున్నారు. కాగా, ప్రభుత్వం నుంచి వచ్చే సాయం సరిపోకపోవడంతో ఎనిమిదేళ్ల గోపాలకృష్ణరెడ్డిపైన కుటుంబ భారం పడింది. ఈ పిల్లాడు స్థానిక పాఠశాలలో మూడో తరగతి చదువుతూ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇంటిని పోషించేందుకుగాను ఆటో డ్రైవింగ్ నేర్చుకున్నాడు సదరు బాలుడు. స్కూల్ పూర్తయిన తర్వాత ఆటో తోలుకుంటా తండ్రిని వెనకాల కూర్చోబెట్టుకుని వ్యాపారం చేస్తున్నాడు గోపాలకృష్ణరెడ్డి. కాగా, ఈ విషయం తెలుసుకుని కలెక్టర్ పాపిరెడ్డి కుటుంబాన్ని ఆదుకోవాలని అధికారులను ఆదేశించారు. పిల్లల చదువులతో పాటు తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యతను తీసుకుంటామని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ పీడీ తెలిపారు.