Inspirational : 8 ఏళ్ల వయసులో స్కూబా డైవర్ గా మారి.. సముద్రంలో ఉన్న 600 కిలోల చెత్తను ఏరేసిన అమ్మాయి
Inspirational : పర్యావరణ పరి రక్షణ కోసం ఎనిమిదేళ్ల చిన్నారి కృషి చేస్తోంది. చిన్న తనంలోనే స్కూబా డైవర్ గా మారి సముద్రంలో చెత్తను తొలగిస్తోంది. సముద్ర అడుగు భాగంలో పేరుకుపోయిన వ్యర్థాలను తీసేస్తోంది. బీచ్ లకు వెళ్లి ఇష్టారీతిగా చెత్తను పడేయడంతో అవి సముద్రం అడుగు భాగానికి వెళ్లి సముద్ర జీవులకు ప్రాణసంకటంగా మారుతున్నాయి. అలాంటి వ్యర్థాలను తొలగించేందుకు చిన్నారి కృషి చేస్తోంది. అలా ఇప్పటి వరకు 600 కిలోల ప్లాస్టిక్ చెత్తను తొలగించింది. తమిళనాడు రాష్ట్రం చెన్నైలోని కరపాక్కంకు చెందిన తారగైకి సముద్రంతో ఎప్పటి నుంచో ప్రత్యేక బంధం ఉంది. ఆమె 5 సంవత్సరాల వయస్సు నుండి డైవింగ్ చేస్తోంది. స్కూబా డైవింగ్ చేయాలన్న ఆసక్తిని తారగైకి ఆమె తండ్రి అరవింద్ తరుణ్‌శ్రీ కల్పించారు. ఆయన ఒక స్కూబా డైవింగ్ నిపుణుడు మరియు బోధకుడు కావడంతో.. ఆయన వారసత్వం తారగైకి వచ్చింది. సముద్రం అడుగు భాగాన ఉన్న అద్భుతమైన ప్రపంచాన్ని ఆస్వాదించడం ఆయన ఆమెకు నేర్పించాడు.
సముద్ర అద్భుతాలను అన్వేషించడాన్ని ప్రోత్సహించారు. అరవింద్ తరుణ్‌శ్రీ దాదాపు 20 సంవత్సరాలుగా స్కూబా డైవింగ్ చేస్తున్నారు. చెన్నై మరియు పుదుచ్చేరిలో స్కూబా డైవింగ్ సెంటర్ నడుపుతున్నారు. ఇప్పటి వరకు చాలా మందికి స్కూబా డైవింగ్ లో శిక్షణ ఇచ్చారు. తన కుమార్తె సముద్రం అడుగు భాగాన అద్భుతాలను శోధించాలని.. అలాగే పర్యావరణ వ్యవస్థను కాపాడాలని అరవింద్ కోరుకుంటున్నారు. చిన్నప్పటి నుండి పిల్లలు ఈత నేర్చుకోవడం చాలా ముఖ్యమని, ప్రతి ఒక్కరికి ఈత నేర్పాలని సూచిస్తున్నారు అరవింద్. తండ్రి నేర్పిన డైవింగ్‌తో పాటు పర్యావరణ పరిరక్షణపై ఆయన కల్పించిన స్ఫూర్తితో చిన్నారి తారగైకి ముందుకు వెళ్తోంది. ఇప్పుడు ఆమె సముద్రాన్ని అమితంగా ప్రేమిస్తోందని.. సముద్ర కలుషితం కావాడాన్ని చూసి తట్టుకోలేక పోతోందని అరవింద్ చెబుతున్నారు. వ్యర్థాలను తొలగించేందుకు తన వంతు ప్రయత్నాన్ని చేస్తోందని వివరిస్తున్నారు.స్కూబా డైవింగ్ కాకుండా, తండ్రీ కూతుళ్లు ఇద్దరు బీచ్‌లు, సముద్రాలను శుభ్రపరచడంతోపాటు సముద్ర కాలుష్యంపై అవగాహన కల్పిస్తున్నారు.

child hero thaaragai arathana removes plastic waste from ocean scuba diving
స్కూబా డైవర్‌గా ఉన్నందున కాలుష్య ప్రభావాన్ని, అది సముద్ర పర్యావరణ వ్యవస్థను ఎలా ప్రభావితం చేస్తుందో చూస్తున్నానని అరవింద్ చెబుతున్నారు. 2007 నుండి ప్రొఫెషనల్ స్కూబా డైవర్‌గా ఉన్న అరవింద్… 17 సంవత్సరాలుగా సముద్రం మరియు తీరాన్ని శుభ్రపరచడానికి తనవంతుగా కృషి చేస్తున్నట్లు చెప్పారు. అలా ఇప్పటి వరకు సుమారు 10,000 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించానన్నారు . ఇప్పుడు, అరవింద్ తన కుమార్తెతో కలిసి బీచ్ మరియు నీళ్లను శుభ్రం చేసే పనిలో ఉన్నాడు. తండ్రీకూతుళ్లు ఇప్పటి వరకు 600 కిలోల ప్లాస్టికత్ బాటిళ్లను సేకరించారు. వారు వాటిని ప్లాస్టిక్ స్కార్ప్ షాపుల్లో అమ్ముతుంటారు. తరువాత వాటిని రీసైకిల్ చేస్తామని చెబుతున్నారు. అలా వచ్చిన డబ్బును తమిళనాడు పర్యావరణ శాఖకు విరాళంగా ఇవ్వాలని అనుకుంటున్నట్లు తండ్రీ కూతుళ్లు చెబుతున్నారు.
