DSP Uday Reddy : జీతం డబ్బులతో గ్రామస్థులకు ఉచిత కంటి చికిత్సలు.. పోలీస్ అధికారి ఔదార్యం..
DSP Uday Reddy : అది 2020వ సంవత్సరం.. నవంబర్ నెల. ఆదిలాబాద్ జిల్లాలోని జామ్‌డా అనే మారుమూల గిరిజన గ్రామంలో డీఎస్‌పీ ఎన్.ఉదయ్ రెడ్డి విధి నిర్వహణలో భాగంగా పర్యటిస్తున్నారు. ఆయన దగ్గరకు ఓ 20 మంది గ్రామస్థులు వచ్చారు. తమకు కంటి సమస్యలు ఉన్నాయని, చూపు సరిగ్గా ఉండడం లేదని, తమ గోడును పట్టించుకోవాలని ఆయన ఎదుట వాపోయారు. వారిని చూసిన ఆయన చలించిపోయారు. చిన్నపాటి శస్త్ర చికిత్సలు చేస్తే వారికి కంటి సమస్యలు పోతాయి. చూపు వస్తుంది. కొందరికి మెడిసిన్‌తో కంటి సమస్యలను నయం చేయవచ్చు. కానీ వారి వద్ద అంత డబ్బు కూడా లేదు. దీంతో వారి బాధకు ఆయనకు కళ్ల వెంబడి నీరు తిరిగినంత పనైంది.
అలా ఆ గ్రామస్థుల సమస్యలు తెలుసుకున్న ఆయన ఏ మాత్రం ఆలస్యం చేయలేదు. తనకు తెలిసిన వారితోపాటు ఎల్‌వీ ప్రసాద్ వంటి కంటి హాస్పిటల్స్‌కు లేఖలు రాశారు. అయితే వారు కంటి వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి ఎవరెవరికి ఏయే సమస్యలు ఉన్నాయో ఉచితంగా పరీక్షలు చేసి చెబుతామన్నారు. కానీ వారికి చికిత్సకు అయ్యే ఖర్చును భరించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఉదయ్ రెడ్డి స్వయంగా ముందుకు వచ్చారు.
DSP Uday Reddy : 300 మందికి కంటి పరీక్షలు చేయించారు.
తన వేతనం నుంచి ఆ గ్రామంతోపాటు చుట్టు పక్కల పలు గ్రామాలకు చెందిన మొత్తం 300 మందికి కంటి పరీక్షలు చేయించారు. అవసరం ఉన్నవారికి శస్త్ర చికిత్సలు చేయించారు. తన వేతనం నుంచి డబ్బులు ఖర్చు పెట్టి ఆయన వారికి ఆపరేషన్లను స్వయంగా చేయించారు. ఈ క్రమంలో అందరికీ కంటి సమస్యలు పోయాయి. చూపు సరిగ్గా లేని వారికి ఇప్పుడు చూపు స్పష్టంగా కనిపిస్తోంది. ఇక మరో 300 మందికి కూడా త్వరలోనే ఆయన చికిత్సలు చేయించనున్నారు. తన వేతనం నుంచి సొంత ఖర్చులతో వారికి సేవ చేస్తున్నందుకు ఆయన గ్రామాల వాసుల దృష్టిలో హీరో అయ్యాడు. ఇంతా చేస్తే.. ఆయన విధుల్లో చేరి ఇంకా ఏడాది కూడా పూర్తి చేసుకోలేదు. అయినప్పటికీ ఆయన ఎంతో మంది అభిమానులను పొందారు. ఇక ఆయన కుటుంబ సభ్యులు కూడా ఆయన చేస్తున్న పనుల్లో భాగస్వాములు అవుతున్నారు. రియల్ హీరో అంటే మీరే సార్.. హ్యాట్సాఫ్..!