Inspirational : అతడికి చావంటే భ‌యం లేదు : 150 మందిని పైగా మృత్యుముఖం నుంచి కాపాడాడు! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Inspirational : అతడికి చావంటే భ‌యం లేదు : 150 మందిని పైగా మృత్యుముఖం నుంచి కాపాడాడు!

 Authored By brahma | The Telugu News | Updated on :3 December 2021,10:10 pm

Inspirational : సాయం చేయాల‌నుకుంటే ల‌క్ష‌లు, కోట్లు ఉండాల్సిన అవ‌స‌రం లేద‌ని మంచి మ‌న‌సుంటే చాల‌ని నిరూపించాడు పుణేకు చెందిన రాజేష్ క‌చి. త‌ను సెల‌బ్రిటీ కాకున్నా ఆ ప్రాంతంలో అత‌డి పేరు చెబితే చాలు చిన్న పిల్ల‌లైనా ఏకంగా శివాజీ న‌గ‌ర్‌లోని రాజేష్ ఇంటికి తీసుకువెళ‌తారు. స్ట్రీట్ ఫుడ్ విక్ర‌యిస్తూ బ‌తుకు బండి నెట్టుకొచ్చే రాజేష్ అంత‌మంది గుండెల్లో ఎలా చోటు సంపాదించాడ‌నే సందేహాలు వెంటాడే వారికి ఆ సామాన్యుడు ఏకంగా 150 మంది ప్రాణాల‌ను కాపాడాడ‌ని తెలిస్తే వావ్ అన‌క మాన‌రు. తోఫ్కానా స్ల‌మ్‌లో చిన్న ఇంటిలో ఉండే రాజేష్ త‌న ఇంటికి 200 మీట‌ర్ల దూరంలో ఉండే ఫుడ్ స్టాల్‌లో ఎగ్ బుర్జీ అమ్ముతూ పొట్ట‌పోసుకుంటాడు. ఆయ‌న ఇంటిలో చుట్టూ మ‌న‌కు అవార్డులే క‌నిపిస్తాయి. 50 ఏండ్ల రాజేష్ జీవితంలో ఇంత‌కుమించి సాధించాల్సిదేముంద‌ని అత‌డితో కొద్దిసేపు మాట్లాడిన‌వారికి అనిపిస్తుంటుంది.

ఇంటి నుంచి ఫుడ్ స్టాల్‌కు రాజేష్ ప్ర‌తిరోజూ ముత్తా న‌దిపై బ్రిడ్జిని దాటి వెళ్లాలి. రాజేష్ చిన్న‌ప్ప‌టి నుంచి ఈ న‌దిలో ఈత కొడుతూ పెరిగాడు. న‌దితో లోతైన అనుబంధం త‌న‌ద‌ని తాను ముత్తా న‌ది రాజాన‌ని మురిపెంగా చెప్పుకుంటాడు. గ‌త మూడు ద‌శాబ్దాలుగా ఈ న‌దిలో మునిగిపోకుండా వంద‌లాది మందిని రాజేష్ కాపాడి వారిని ఒడ్డుకు చేర్చాడు. విధి విసిరే స‌వాల్‌లో సుదూర తీరాల‌కు చేరాల్సిన ఎంద‌రినో ఒడ్డుకు చేర్చి బ‌తుకునివ్వ‌డంతోనే రాజేష్ అంద‌రికీ హీరో అయ్యాడు. చిన్న‌త‌నంలోనే త‌ల్లితండ్రుల‌ను కోల్పోయిన రాజేష్ స్కూల్‌ను అర్ధంత‌రంగా ముగించి బ‌తుకు పోరాటంలో రాటుదేలాడు.

Hero street vendor who risked his life to save over 150 others

Hero street vendor who risked his life to save over 150 others

Inspirational : 150 మందిని పైగా మృత్యుముఖం నుంచి కాపాడాడు

అమ్మ‌మ్మ ద‌గ్గ‌ర పెరిగిన తాను న‌దీతీరంలో వ్య‌వ‌సాయ ప‌నుల్లో నిమ‌గ్న‌మ‌వ‌డంతో పాటు చిన్న‌త‌నంలో న‌దిలో ఈత కొట్టేవాడిన‌ని రాజేష్ చెబుతుంటాడు. తాను 19 ఏండ్ల వ‌య‌సులో ఓ బాలిక న‌దిలో మునిగిపోవ‌డం చూసి వెంట‌నే నీటిలో దూకి ఆమెను కాపాడాన‌ని గుర్తుచేసుకున్నాడు. ఇష్టం లేని పెండ్లి చేస్తున్నారనే బాధ‌తో ఆమె ఆత్మ‌హ‌త్య‌కు ప్ర‌య‌త్నించింద‌ని కుటుంబ‌సభ్యులు కంట‌త‌డి పెడుతూ తమ కూతురిని కాపాడినందుకు వారు త‌న‌ను మెచ్చుకుంటే ఉద్వేగానికి గుర‌య్యాన‌ని గుర్తుచేసుకున్నాడు. అప్ప‌టినుంచి త‌న కండ్ల ముందు ఎవ‌రూ చ‌నిపోకూడ‌ద‌ని తీర్మానించుకున్నాన‌ని చెబుతాడు. అప్ప‌టినుంచి 150 మందికిపైగా న‌దిలో మునిగిపోతున్న వారిని, ఆత్మ‌హ‌త్య‌కు ప్ర‌య‌త్నించేవారిని రాజేష్ కాపాడాడు.

వ‌ర‌ద‌ల్లోనూ న‌ది ఉప్పొంగిన సమ‌యాల్లో రాజేష్ ఆప‌న్న‌హ‌స్తం అందించేవాడు. అలా త‌న పేరు అంద‌రికీ తెలియ‌డంతో ఆప‌ద‌లో త‌న‌ను పిలిచేవార‌ని, ఆ స‌మ‌యంలో ఫుడ్ స్టాల్‌లో ఎంత బిజీగా ఉన్నా ప‌రుగున అక్క‌డికి చేరుకునే వాడిన‌ని చెబుతున్నాడు. అర్ధ‌రాత్రి పిలిచినా రాజేష్ అందుబాటులో ఉండి ఆప‌ద నుంచి కాపాడేవాడ‌ని అతడి గురించి తెలిసిన వారు చెబుతారు. సంప‌ద లేని సామాన్యుడు, స్కూల్ డ్రాప‌వుట్ అయిన రాజేష్ త‌న ప‌రిధిలో చేస్తున్న సాయం ఆ ప్రాంత వాసుల‌కు అత‌డిని ఆత్మీయుడిని చేసింది. రాజేష్ రియ‌ల్ హీరో అని వారంతా చెబుతుంటే అదేమీ ప‌ట్ట‌నంటూ త‌న ప‌నిలో ప‌డుతుంటాడు ఆయ‌న‌.

brahma

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది