Kalamkari Fabrics : 400 ఏళ్ల చరిత్ర ఉన్న కలంకారీ ఆర్ట్ ను ప్రపంచానికి పరిచయం చేసి తండ్రి కలను నెరవేర్చాడు
Kalamkari Fabrics: పిచ్చుక శ్రీనివాస్..! ప్రముఖ కలాకారీ కళాకారుడు..! ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఈయన కలంకారీ కళను ప్రపంచదేశాలకు పరిచయం చేశాడు. ప్రపంచంలోని పలు దేశాలకు తాను తయారు చేసిన ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నాడు. మరి ఎక్కడో ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నం ప్రాంతానికి చెందిన పిచ్చుక శ్రీనివాస్ తన తండ్రి నుంచి నేర్చుకున్న ఈ పురాతన కళను ప్రపంచానికి ఎలా పరిచయం చేయగలిగాడు..? కలంకారీ కళను విశ్వవ్యాప్తం చేయాలన్న తన తండ్రి కలను ఎలా నెరవేర్చగలిగాడు.. అనే వివరాలు తెలుసుకోవాలనుందా..? అయితే ఈ కింది సమాచారం చదివేయండి..
పిచ్చుక శ్రీనివాస్ కలంకారీ కళను ప్రపంచానికి పరిచయం చేయడానికి ఒక్క ఈ మెయిల్ తోడ్పడింది. 2001లో న్యూయార్క్‌కు చెందిన మేరీ బెర్గ్‌టోల్డ్ అనే మహిళ కళంకారీ వస్త్రాలు కావాలంటూ ఇండియా మార్టు ఈ-కామర్స్ కంపెనీ పోర్టల్‌లో ప్రకటన ఇచ్చింది. అప్పుడు 20 లలో ఉన్న పిచ్చుక శ్రీనివాస్ ఈ మెయిల్ ద్వారా ఆ ప్రకటనను చూసి.. మేడం నేను నా ఆర్ట్‌ను మీకు చూపిస్తాను. శాంపిల్స్ కోసం ఆర్డర్ చేయండి అంటూ రెస్పాండ్ అయ్యాడు.
Good responce: ఫ్యాషన్ పరిశ్రమ నుంచి కలంకారీకి మంచి స్పందన
హార్పర్ బజార్ మ్యాగజీన్‌కు మాజీ ఫ్యాషన్ ఎడిటర్ అయిన మేరీ బెర్గ్‌టోల్డ్‌ను శ్రీనివాస్ పంపిన సిన్సియర్ మెసేజ్ ఇంప్రెస్ చేసింది. అందుకే ఆమె ప్రకటనకు స్పందించిన అందరిలో మేరీ.. శ్రీనివాస్‌ను మాత్రమే ఎంచుకుంది. వెంటనే కలంకారీ శాంపిల్స్ పంపమని కోరుతూ డబ్బులు పంపింది. శ్రీనివాస్ నుంచి శాంపిల్స్ అందగానే ఓ నేషనల్ మ్యాగజీన్‌కు వాటిని పంపింది. వాళ్లు ఆ శాంపిల్స్‌ను తమ మ్యాగజీన్‌లో అచ్చువేయడంతో అక్కడి ఫ్యాషన్ పరిశ్రమ నుంచి మంచి స్పందన వచ్చింది.
దాంతో మేరీ బెర్డ్‌టోల్డ్ 2002 నుంచి తన లెస్ ఇండియెన్నెస్ స్టోర్‌లో కలంకారీ వస్త్రాలను అమ్మడం మొదలుపెట్టింది. కలంకారీకి చెందిన టేబుల్ లైనెన్స్, మెత్తలు, పురుపు కవర్లు, మెత్తల కవర్లను ఆమె కస్టమర్ల కోసం అందుబాటులో ఉంచింది. ఇద్దరి మధ్య వ్యాపార సంబంధాలు మొదలైన రెండేండ్ల తర్వాత తాను అమెరికా వెళ్లి మేరీని కలిసినట్లు శ్రీనివాస్ చెప్పాడు. తాను కలంకారీ వస్త్రాల తయారీకి కెమికల్ ఫ్రీ రంగులు వాడుతానని, 16వ శతాబ్దం నాటి రా మెటీరియల్ వినియోగిస్తానని అందుకే తన ఉత్పత్తులు మేరీని ఆకర్షించాయని తెలిపాడు.
Internet: ఇంటర్నెట్‌తో 400 ఏండ్ల కళ విశ్వవ్యాప్తం
ప్రస్తుతం 50 ఏండ్లు దాటిన పిచ్చుక శ్రీనివాస్ జపాన్, యునైటెడ్ కింగ్ డమ్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, నెదర్లాండ్స్, జర్మనీ తదితర దేశాలకు తన ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నాడు. ఈ కలంకారీ కళను శ్రీనివాస్ తండ్రి పిచ్చుక వీర సుబ్బయ్య 1970 లలో నేర్చుకున్నాడు. తండ్రి నుంచి శ్రీనివాస్‌కు ఆ కళ అబ్బింది. అయితే, ఈ కళ అంటే తన తండ్రికి ఎంతో మక్కువ ఉండేదని, ఈ పురాతన కళ దేశదేశాలకు విస్తరించాలని ఆయన కలగనేవాడని, తన తండ్రి కలను తాను సాకారం చేయగలిగానని శ్రీనివాస్ పేర్కొన్నాడు.
ఇంటర్నెట్ అనే ఒక శక్తివంతమైన ప్లాట్‌ఫామ్ ద్వారా 400 ఏండ్ల పురాతన చరిత్రగల భారతీయ వస్త్ర కళ కలంకారీ ప్రపంచవ్యాప్తం కావడాన్ని తాను నమ్మలేకపోతున్నానని శ్రీనివాస్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఎప్పటికప్పుడు డిజైన్‌లలో, ప్రింటింగ్‌లలో మార్పులు చేసుకుంటూ సాగుతుండటమే తన వ్యాపార అభివృద్ధికి కారణమని చెప్పాడు. ఇప్పుడు శ్రీనివాస్ కుమారుడు పిచ్చుక వరుణ్ కూడా కలంకారీ వస్త్ర వ్యాపారంలో అడుగుపెట్టి తండ్రి బాటలో నడుస్తున్నాడు.