Mahaboobnagar.. అమాయకులను మోసం చేస్తున్న ముఠా అరెస్టు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Mahaboobnagar.. అమాయకులను మోసం చేస్తున్న ముఠా అరెస్టు

 Authored By praveen | The Telugu News | Updated on :4 September 2021,10:14 am

అమాయక ప్రజలను టార్గెట్ చేస్తూ మూఢనమ్మకాలను ఆసరా చేసుకుని డబ్బు దోచుకుంటున్న ముఠాను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. రెండేళ్లుగా తప్పించుకున్న తిరుగుతున్న ఎనిమిది మందని పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. ఈ సందర్భంగా గద్వాల జిల్లా కేంద్రంలో ఎస్పీ రంజన్ రతన్ కుమార్ ముఠా చేసిన మోసాలను వివరించారు. ప్రజల్లో మూఢనమ్మకాలను ఇంకా పెంచి వారి వద్ద నుంచి డబ్బు కాజేయడమే వీరి టార్గెట్ అని పోలీసులు తెలిపారు.

ఈ ముఠా ఓ వ్యక్త నుంచి ఏకంగా రూ.62 లక్షలు కాజేసింది. మహారాష్ట్రలోని వాసి జిల్లా రిసోడ్‌కు చెందిన మహమ్మద్‌ తాశావర్‌ఖాన్, సయ్యద్‌ఇక్బాల్, అజయ్, భీంరావు, అలీముద్దీన్, నవాజ్‌షేక్, హైదరాబాద్‌కు చెందిన అన్వర్‌ఖాన్, షేక్‌బషీర్‌ ఓ ముఠాగా ఏర్పడి మంత్రాల పేరిట ప్రజలను మోసం చేయడం స్టార్ట్ చేశారు. వీరు జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ మండలం ఉప్పలకు చెందిన ప్రహ్లాద్‌రెడ్డికి 2019 అక్టోబర్‌లో మాయమాటలు చెప్పారు. నాగదేవతకు పూజలు చేస్తే ప్రత్యేక శక్తులు వస్తాయని నమ్మించారు. ఈ క్రమంలోనే పూజా చేస్తున్నట్లు చెప్పి ఇంట్లోకి వెళ్లి పూజ చేస్తున్నట్లు యాక్షన్ చేసి మత్తు మందున్న పౌడర్ ప్రహ్లాద్‌రెడ్డిపై చల్లి ఇంట్లోని రూ.62.5 లక్షలను దోచుకెళ్లారు. బాధితుడు రెండ్రోజుల తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు విచారణ ప్రారంభించారు. ఇదే తరహాలో ముఠా సభ్యులు తుపత్రాలలో సూర్యవెంకటన్నగౌడ్ అనే వ్యక్తికి మాయమాటలు చెప్పి రూ.30 వేలు కాజేశారు. పోలీసులు ముఠా సభ్యులను అరెస్టు చేసి వారి నుంచి రాగి రింగులు, సెల్ ఫోన్లు, విభూతి, నాగుపాముతో పాటు రూ.25 వేలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించారు. కేసు దర్యాప్తులో చురుకుగా వ్యవహరించిన పోలీసులను ఎస్పీ అభినందించారు.

Advertisement
WhatsApp Group Join Now

praveen

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది