Ratha Saptami : నేడే.. రథసప్తమి.. విష్టత ఏమిటో తెలుసా..?
Ratha Saptami : భూమిపై జీవరాశుల మనుగడకు సూర్యుడే కారణం. ఈ కారణంగానే భానుడిని కనిపించే దేవుడు అంటారు. హిందూ సంప్రదాయం ప్రకారం సూర్యాధనకు ఎంతో విశిష్టత ఉంది. అన్నదాత, ఆరోగ్య ప్రధాత అయిన సూర్యభగవానుని ఆరాధించే రోజును రథసప్తమిగా జరుపుకుంటారు హిందువులు.మాఘ మాసం శుక్లపక్షం సప్తమి తిథి ‘రథ సప్తమి’గా ప్రసిద్ధం. సూర్యరథం దక్షిణాయనం ముగించి, పూర్వోత్తర దిశగా పయనం సాగిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. మాఘ సప్తమి మొదలు.. వచ్చే ఆరు మాసాలూ ఉత్తరాయణ పుణ్యకాలం. అదితి, కశ్యప ప్రజాపతి దంపతులకు మహావిష్ణువు సూర్య భగవానుడిగా ఉదయించాడు కాబట్టి, నేడు ‘సూర్య జయంతి’ అని పురాణ గాథలు చెబుతాయి.ఆరోగ్య ప్రదాత..రథ సప్తమి ప్రాశస్త్యాన్ని తెలిపే ఒక కథ భవిష్య పురాణంలో ఉంది. పూర్వం కాంభోజ దేశాన్ని యశోధర్ముడు అనే రాజు పరిపాలించేవాడు. సంతానం కోసం ఎంతో ఎదురు చూసిన ఆయనకు… వార్థక్యంలో ఒక కుమారుడు కలిగాడు. కానీ పుట్టుకతోనే అతను అనారోగ్యవంతుడు.
దీనికి ఎంతో తల్లడిల్లిపోయిన యశోధర్ముడు… తన పుత్రుడు పుట్టురోగి కావడానికి కారణం ఏమిటని ఆస్థాన జ్యోతిష పండితులను అడిగాడు.ఆ బాలుడి జాతకాన్ని పరిశీలించిన, దీర్ఘ దృష్టితో ఆలోచించిన ఆ పండితులు ‘‘ఓ రాజా! ఇతడు గత జన్మలో ఒక వర్తకుడు. పరమ లోభి. అయితే పూర్వ జన్మ పుణ్యం కొద్దీ, ఎవరో రథసప్తమి వ్రతం చేస్తూ ఉంటే చూశాడు. ఆ కాస్త పుణ్యానికే ఈ జన్మలో రాజవంశంలో జన్మించాడు గత జన్మలో పిసినారి కనుక ఈ జన్మలో రోగ పీడితుడయ్యాడు. రథ సప్తమి వ్రతాన్ని చూస్తేనే ఇంతటి భాగ్యం కలిగినప్పుడు, స్వయంగా ఆచరిస్తే ఎంత గొప్ప ఫలితం ఉంటుందో ఊహించండి. రోగ విముక్తుడు కావడమే కాదు, చక్రవర్తి కూడా అవుతాడు’’ అని చెప్పారు. వారి ఉపదేశంతో… తన కుమారుడితో రథసప్తమీ వ్రతాన్ని మహారాజు చేయించాడు. ఫలితంగా ఆ రాజ కుమారుడు ఆరోగ్యవంతుడే కాదు, చక్రవర్తి కూడా అయ్యాడు. రథసప్తమికీ, ఆ రోజున చేసే జప, ధ్యాన, వ్రతాలకూ అనంతమైన ప్రభావం ఉంటుందని పెద్దలు చెబుతారు.
Ratha Saptami : స్నానం మహా ఫలం..
మాఘ శుద్ధ సప్తమిని ‘రథ సప్తమి’ అంటారు. సూర్యోదయం ఉన్న సప్తమి రోజునే దీన్ని ఆచరించాలి. ఈ సప్తమి సూర్య గ్రహణంతో సమానమైనది. అరుణోదయ సమయంలో చేసే స్నానం మహా ఫలితాన్ని ఇస్తుంది. స్నానం చేసే సమయంలో స్థిరమైన బుద్ధితో సూర్యుణ్ణి హృదయంలో ధ్యానించాలి.
Ratha Saptami : సిరుల పొంగు..
రథ సప్తమినాడు ముంగిట్లో రథం ముగ్గులు సుందరంగా కనిపిస్తాయి. ఆ ముగ్గుల నడుమ పిడకలు వేసి, సూర్యభగవానుడికి ప్రియమైన పాయసం వండుతారు. పిడకలపైన పాలు పొంగించడాన్ని ‘సిరుల పొంగు’కు సంకేతంగా భావిస్తారు. అప్పటికే రైతులు ధాన్యరాశులను ఇళ్లకు చేర్చి ఉంటారు. ఉదయాన్నే ఇంటిల్లిపాదీ స్నానాలు ముగిస్తారు. గాయత్రీ జపం, ఆదిత్య హృదయం, సూర్యాష్టకం, సూర్య సహస్రం వంటి స్తోత్ర పాఠాలు వల్లిస్తూ పూజలు చేయడం రివాజు.