KCR Birthday : కేసీఆర్ రాజకీయ జీవితాన్ని ఒకసారి తెరిచి చూస్తే..!
KCR Birthday : కేసీఆర్ పుట్టినరోజు (కే చంద్రశేఖర్ రావు) .. అనే మూడు అక్షరాలు తెలంగాణ చరిత్రలో సువర్ణాధ్యాయాన్ని లిఖించాయి. ఈ మూడు అక్షరాలే ఢిల్లీలో తన గళం వినిపించి మరీ.. తెలంగాణను తీసుకొచ్చాయి. పార్లమెంట్ ను కూడా గడగడలాడించాయి. అసాధ్యం అనుకున్న తెలంగాణను సుసాధ్యం చేసి చూపించాయి. ఆ మూడు అక్షరాలే తెలంగాణను నేడు ఎక్కడికో తీసుకుపోయాయి. స్వరాష్ట్రంలో తెలంగాణ ప్రజలు సగర్వంగా తలెత్తుకునేలా చేశాయి. అందుకే ఆ మూడు అక్షరాలకు తెలంగాణ వ్యాప్తంగా ఎంతో పాపులారిటీ వచ్చింది. తెలంగాణ రాజకీయాల్లో, చరిత్రలో చిరకాలం నిలిచిపోయే నేత కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేక కథనం.
KCR Birthday : కేసీఆర్ కుటుంబ నేపథ్యం
కేసీఆర్ పుట్టింది మెదక్ జిల్లా చింతమడక గ్రామం. అతి సాధారణ కుటుంబంలో జన్మించారు కేసీఆర్. సిద్ధిపేటలో బీఏ చదివి.. ఆ తర్వాత ఉస్మానియాలో కేసీఆర్ ఎంఏ తెలుగు చదివారు. డిగ్రీలో చరిత్ర, రాజనీతి శాస్త్రం, తెలుగు సాహిత్యం సబ్జెక్టులను కేసీఆర్ చదివారు.
విద్యార్థి నేతగా ఉన్నప్పుడే కేసీఆర్ రాజకీయాల్లో బాగా చురుకుగా ఉండారు. విద్యార్థి సంఘం నాయకుడిగానూ ఉన్నారు. అప్పటి నుంచే ఆయనకు రాజకీయాల్లో రాణించాలనే కోరిక బలంగా ఉండేది. కేసీఆర్ కు రాజకీయాలు నేర్పింది అనంతుల మదన్ మోహన్. ఆయన దగ్గరే రాజకీయాలను కేసీఆర్ నేర్చుకున్నారు. ఆ తర్వాత 1970 సమయంలో కేసీఆర్ యువజన కాంగ్రెస్ నాయకుడిగా ఉన్నారు. ఆ తర్వాత 1982 లో సీనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టడంతో.. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు.
1983 ఎన్నికల్లో టీడీపీ తరుపున.. తన రాజకీయాలు నేర్పిన గురువు మదన్ మోహన్ పైనే పోటీ చేసిన కేసీఆర్.. స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత 1985 లో జరిగిన ఎన్నికల్లో మళ్లీ పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. అప్పటి నుంచి ఇక కేసీఆర్ వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఆ తర్వాత టీడీపీలో కేసీఆర్ ఎన్ని పదవులను చేపట్టారో అందరికీ తెలుసు.
చంద్రబాబు మంత్రిని చేయకపోవడంతో.. టీఆర్ఎస్ పార్టీ స్థాపన
టీడీపీలో ఎన్నో పదవులు అనుభవించిన కేసీఆర్.. 1999లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు.. తన కేబినేట్ లో కేసీఆర్ కు స్థానం కల్పించలేదు. దీంతో కేసీఆర్ తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. 2001 లో టీడీపీ పార్టీకి, డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా సమర్పించారు.
టీడీపీకి రాజీనామా చేసిన వారం రోజుల్లోనే తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో పార్టీని స్థాపించి.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం నినాదంతో ముందుకెళ్లారు. కేసీఆర్.. పార్టీ పెట్టిన సమయంలోనే కొత్తగా దేశంలో మూడు రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఉత్తరాఖండ్, జార్ఖండ్, చత్తీస్ గఢ్ రాష్ట్రాలు ఏర్పడటంతో.. కొట్లాడితే.. ఉద్యమం చేస్తే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కూడా సాధ్యమే అని కేసీఆర్ కు అర్థమయింది. దీంతో ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించారు. తెలంగాణ పోరాటంతో ప్రతి తెలంగాణ పౌరుడు పాల్గొనేలా కేసీఆర్ ఉద్యమాన్ని అప్రతిహాతంగా నిర్వహించారు.
కేసీఆర్ జీవితంలోనే ముఖ్యమైన ఘట్టం.. ఆమరణ నిరాహార దీక్ష
కేసీఆర్ జీవితంలో మరిచిపోలేని ఘటన.. 2009లో కేసీఆర్ చేసిన ఆమరణ నిరాహార దీక్ష. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ చేసిన ఈ దీక్ష యావత్ తెలంగాణ ప్రజానీకంలో ఆక్రోశాన్ని రగల్చింది. ఎన్ని అడ్డంకులు వచ్చినా.. తెలంగాణ రాష్ట్రం సిద్ధించేదాకా.. తన దీక్షను విడవనని కేసీఆర్ మొండి పట్టు పట్టారు. దీంతో ఆయన్ను నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ కూడా ఆయన తన దీక్షను కొనసాగించారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి రోజురోజుకూ క్షిణిస్తుండటం.. తెలంగాణ ప్రజలు ఆవేశంతో రోడ్ల మీదికి వచ్చి రచ్చ రచ్చ చేస్తుండటంతో.. అప్పటి కేంద్ర ప్రభుత్వం యూపీఏ దిగిరాక తప్పలేదు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం అవుతుందని.. అప్పటి మంత్రి చిదంబరం పార్లమెంట్ లో ప్రకటించడంతో.. తెలంగాణ వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తం అవడంతో పాటు.. కేసీఆర్ తన ఆమరణ నిరాహార దీక్షను విరమించారు.
అప్పటి నుంచి మళ్లీ గొడవలు జరగడం.. ఆంధ్రాలో ఉద్యమం లేవడం.. కేంద్రం మరోసారి తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను విరమించడం.. మళ్లీ ఉద్యమం తారా స్థాయికి చేరడం.. చివరకు 2014 జూన్ 2న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ సాధించి చూపించి… అదే రోజున తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలంగాణలో ఎన్ని మార్పులు చోటు చేసుకున్నాయో అందరికీ తెలిసిందే. తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి అయ్యాక.. దేశంలోనే లేనటువంటి ఎన్నో సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. తెలంగాణను దేశానికి ఆదర్శంగా ఉండేలా తీర్చిదిద్దడంలో కేసీఆర్ సఫలం అయ్యారు.