Hair Tips : ఒత్తైన జుట్టు కోసం పైసా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు
Hair Tips : జుట్టు రాలడం చిన్న వారి నుంచి పెద్ద వారి వరకు అందరినీ వేధిస్తున్న సమస్య. ఈ మధ్యకాలంలో చాలా మంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. చాలా మంది ఊడిపోయిన జుట్టును తిరిగి పొందడం కోసం రకరకాల నూనెలు వాడతారు. కొందరు మందులు వేసుకుంటారు. కానీ అవేవీ సరైన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో మానసిక ఒత్తిడికి లోనవుతారు. దీనికి ఒక చిన్న చిట్కాతో మంచి పరిష్కారం దొరుకుతుంది. ఇంట్లో ఉండే పదార్థాలతోనే దీనిని తయారు చేసుకుని జుట్టుకు పట్టుకుంటే ఒత్తుగా, బలంగా పెరుగుతుంది. దాని కోసం వేలకు వేలు ఖర్చు చేయాల్సిన అవసరం తప్పుతుంది.కరివేపాకు జుట్టు పెరుగుదలకు చాలా బాగా ఉపయోగపడుతుంది.
బయట నుంచే కాకుండా ఆహారం తీసుకోవడం ద్వారా కూడా జుట్టు పెరుగుదలకు కరివేపాకు చాలా బాగా సాయపడుతుంది. తరచూ కరివేపాకు ఆహారంలో భాగంగా చేసుకోవాలి. కరివేపాకును కడిగి ఆరబెట్టి నూనె లాంటివేమీ లేకుండా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న కరివేపాకును తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక రెండు స్పూన్ల మెంతులను నూనె లేకుండా చక్కగా ఫ్రై చేసుకోవాలి. మెంతులు బాగా వేగిన తర్వాత ఇవి కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత కరివేపాకు, మెంతులను మెత్తగా పొడిగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక పాన్ పెట్టి దాంట్లో కొద్దిగా కొబ్బరి నూనె వేసుకోవాలి. కొబ్బరి నూనె ఆర్గానిక్ లేదా గానుగ నూనె అయితే చాలా మంచిది.
అందులో ముందుగా తయారు చేసి పెట్టుకున్న కరివేపాకు, మెంతుల పొడిని వేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని బాగా మరిగించాలి. తర్వాత స్టవ్ ను సిమ్ లో ఉంచి నురగ పోయే వరకు స్టవ్ మీదనే పెట్టాలి. తర్వాత పాన్ ను కిందకు తీసుకుని మరో మూడు, నాలుగు గంటల పాటు చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన ఆ నూనెను ఏదైన డబ్బాలో తీసుకుని నిల్వ చేసుకోవచ్చు.రోజూ ఆ నూనెను చిన్న గిన్నెలో తీసుకుని గోరు వెచ్చగా చేసి తలకు పెట్టుకోవాలి. మెల్లగా మసాజ్ చేస్తూ జుట్టు మొత్తానికి మొదలు నుంచి చివర్ల వరకు నూనె పెట్టుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే చుండ్రు, దురద సమస్యలు తగ్గడంతో పాటు జుట్టు బలంగా, దృఢంగా తయారవుతుంది.