పిల్లలపై కరోనా దారుణమైన ప్రభావం చూపించింది.. నిజాలు బయటపెట్టిన యూనిసెఫ్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

పిల్లలపై కరోనా దారుణమైన ప్రభావం చూపించింది.. నిజాలు బయటపెట్టిన యూనిసెఫ్

 Authored By brahma | The Telugu News | Updated on :10 March 2021,4:30 pm

corona : ప్రపంచంపై కోవిడ్19 మహమ్మారి చూపించిన ప్రభావం అంతా ఇంతా కాదు. ఎన్నో వ్యవస్థలను కుప్పకూల్చిన కరోనా వైరస్ ప్రభావం ఇంకా వెంటాడుతూనే ఉంది. అయితే కొవిడ్‌ సంక్షోభం ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో పాటు, చిన్న పిల్లల ఆరోగ్య, మానసిక, సామాజిక వ్యవస్థలపైన కూడా దారుణమైన ప్రభావం చూపించిందని ‘యునిసెఫ్‌’ తన తాజా నివేదికలో వెల్లడించింది.

corona effect on children

ఈ కారణంగా భారత్‌లో 5 కోట్ల మందికిపైగా పిల్లలు మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నారని నివేదించింది. కరోనా ప్రభావంతో పిల్లలు అధిక ఒత్తిడికి లోనయ్యారని యూనిసెఫ్‌ చెబుతోంది. ‘‘ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, సంరక్షకులు.. పిల్లలకు మానసికంగా, సామాజికంగా సహకారం అందించాలి. బాలలు ఒత్తిడి, భయం, ఆవేదనను తట్టుకునేలా ముమ్మరంగా చర్యలు చేపట్టాలి.

గత ఏడాది కాలంగా పిల్లలపై హింసాత్మక ఘటనలు పెరగటం గుర్తించాలని అంటోంది యునిసెఫ్. పిల్లలు మానసికంగా ఒత్తిడికి లోనైనప్పుడు ఎలా స్పందించాలన్న విషయంపై..పలు విభాగాలకు శిక్షణా కార్యక్రమాలను నిర్వహించింది యునిసెఫ్.. చైల్డ్‌లైన్, ప్రభుత్వ అధికారులు, జిల్లాల్లో బాలల సంరక్షణ విభాగాలు, పిల్లల రక్షణ సంస్థల్లోని 8వేలకు పైగా సిబ్బంది ఈ రకమైన శిక్షణ పొందారు.

కరోనా సమయంలో ఇచ్చిన ఈ శిక్షణ ద్వారా పిల్లలకు కౌన్సిలింగ్ జరగాలని కోరింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడుగురు పిల్లల్లో ఒకరు.. కొవిడ్‌-19 లాక్‌డౌన్‌ కారణంగా మానసిక అనారోగ్యం బారిన పడినట్లు తేలింది. ఆ సమయంలో 13 కోట్ల మందికిపైగా బాలలు ఇంటికే పరిమితమయ్యారు. మరోపక్క కొవిడ్‌ మహమ్మారి కారణంగా ప్రపంచంలోని 93 శాతం దేశాల్లో మానసిక వైద్య సేవలు నిలిచిపోయినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.

corona

కరోనావైరస్‌తో చిన్నారులకు తీవ్రమైన ఇబ్బందులు ఎదురుకాలేదన్నది వాస్తవం. వారిలో మరణాల సంఖ్య కూడా చాలా తక్కువ. కానీ కోవిడ్‌ కారణంగా అత్యధిక సంఖ్యలో బాధితులుగా మారింది మాత్రం చిన్నపిల్లలే..ఎగిరే పక్షికి రెక్కలు తెగిన చందంగా లాక్‌డౌన్ కాలంలో ఇళ్లలోనే బందీ అయ్యారు. పెద్దవారి వేధింపులు, వారి బాగోగుల‌ను పట్టించుకోలేని స్థితి కారణంగా మానసిక సమస్యలు చిన్నారులను వెంటాడాయి. భావితరాలను కోవిడ్ మహమ్మారి కోలుకోలేని దెబ్బతీసిందని నిపుణులు అంటున్నారు.

స్కూళ్లు మూసివేయడంతో చిన్నారుల చదువులు కుంటుపడ్డాయి. అయితే స్కూళ్లను కేవలం చదువుకునే ప్రదేశాలుగానే చూడలేం. సహజసిద్ధంగా పిల్లల మానసిక, శారీరక అభివృద్ధికి అవి కేంద్రాలుగా ఉంటాయి. కుటుంబాలలోని ఇబ్బందుల కార‌ణంగా.. వారు ఎదుర్కొనే అనేక మానసిక సమస్యల నుంచి బైటపడటానికి స్కూళ్లు ఉపయోగపడతాయి. స్కూళ్లను మూసేయడం ద్వారా పిల్లల జీవితాలనే మూసేయడం జరిగింది. ఒంటరితనం, నిద్రలేమి సహా పిల్లలపై అనేక దుష్ప్రభావాలకు కరోనా మహమ్మారి కారణమైంది.

Advertisement
WhatsApp Group Join Now

brahma

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది