Business Idea : ఇంజనీరింగ్ డ్రాప్ అవుట్.. బిలియన్ డాలర్ల కంపెనీని నెలకొల్పాడు.. ఎలా సాధ్యమయిందో తెలుసా?
Business Idea : ఒక ఇంజనీరింగ్ డ్రాప్ అవుట్ ఏం చేయగలుగుతాడు. ఆర్థికంగా సమస్యలు ఉన్న వాళ్లు.. తల్లిదండ్రులు కూడా పేదలు అయితే ఏం చేస్తారు? ఏదో ఒక పని చేసుకొని బతుకుతారు. ఎందుకంటే.. తిండి కోసం ఏదో ఒక పని చేయాలి కదా. కానీ.. ఈ యువకుడు మాత్రం ఏదో ఒక పని చేసుకొని బతకలేదు. ఏకంగా ఒక యూనికార్న్ కంపెనీనే నెలకొల్పాడు. తీరా చూస్తే అతడు ఇంజనీరింగ్ డ్రాప్ అవుట్. మరి.. అంత పెద్ద కంపెనీని ఎలా స్థాపించాడో తెలుసుకుందాం పదండి.
అలఖ్ పాండే గురించే మనం ఇప్పుడు మాట్లాడుకునేది. ఫిజిక్స్ వాలా(PhysicsWallah) పేరుతో ఎడ్యుటెక్ స్టార్టప్ ను స్థాపించాడు. ప్రస్తుతం ఆ కంపెనీ దేశంలోని యూనికార్న్ కంపెనీలలో ఒకటి. ఆ కంపెనీ విలువ ఒక బిలియన్ డాలర్ కంటే ఎక్కువ.
Business Idea : అలఖ్ ఆరో తరగతిలోనే సొంతింటిని కూడా కోల్పోయాడు
అలహాబాద్ లో పుట్టి పెరిగిన అలఖ్ చిన్నతనంలో ఎన్నో కష్టాలను అనుభవించాడు. తను ఆరో తరగతి చదువుతున్నప్పుడే తన తండ్రి సొంతింటిని అమ్మేశాడు. అప్పటి నుంచే స్కూల్ పిల్లలకు ట్యూషన్ చెప్పడం ప్రారంభించాడు అలఖ్. తను స్కూల్, కాలేజీ చదివే సమయంలో కూడా ట్యూషన్లు చెప్పి అంతో ఇంతో డబ్బు సంపాదించేవాడు అలఖ్. అలా.. తనకు టీచింగ్ ఒక పాషన్ లా మారింది.
ఆ తర్వాత కాలేజీ చదువును మధ్యలోనే వదిలేసి.. అలహాబాద్ కు వచ్చేసిన అలఖ్.. ఒక ట్రెయినింగ్ ఇనిస్టిట్యూట్ లో నెలకు రూ.5000 జీతానికి ట్యూటర్ గా చేరాడు. ట్యూటర్ గా పిల్లలకు క్లాసులు చెబుతూనే ఒక యూట్యూబ్ చానెల్ ఏర్పాటు చేసి అందులో ట్యూషన్ కు సంబంధించిన వీడియోలను అప్ లోడ్ చేసేవాడు అలఖ్. యూట్యూబ్ లో మంచి రెస్పాన్స్ రావడంతో పాటు సబ్ స్క్రైబర్స్ కూడా పెరగడంతో వెంటనే ట్యూటర్ ఉద్యోగం మానేసి.. యూట్యూబ్ మీద ఫోకస్ పెంచాడు అలఖ్.
2017 లో 4000 సబ్ స్క్రైబర్స్ నుంచి 2019 లో 2 మిలియన్ల సబ్ స్క్రైబర్స్ ను చేరుకుంది తన యూట్యూబ్ చానెల్. కోవిడ్ సమయంలో ఫిజిక్స్ వాలా యాప్ ను ప్రారంభించాడు అలఖ్. అప్పటి నుంచి ఇక వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు అలఖ్ కు. తన యాప్ విద్యార్థుల్లో ఫేమస్ కావడంతో అలఖ్ కంపెనీకి ఇన్వెస్టర్లు తరలివచ్చారు. దీంతో అది ఇండియాలో ఉన్న యూనికార్న్ కంపెనీలలో ఒకటిగా నిలిచింది.