వైసీపీ లో యాక్టీవ్ అవుతున్న విశాఖ కీలక నేత.. జగన్ ఒప్పుకుంటాడా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

వైసీపీ లో యాక్టీవ్ అవుతున్న విశాఖ కీలక నేత.. జగన్ ఒప్పుకుంటాడా..?

 Authored By brahma | The Telugu News | Updated on :15 March 2021,9:40 am

Ys jagan : విశాఖ జిల్లాలో అనకాపల్లి వంటి రాజకీయ చైతన్యం కలిగిన ప్రాంతం నుంచి ఎమ్మెల్యేగా రాజకీయాల్లోకి ప్రవేశించిన దాడి వీరభద్రరావు అనేక మార్లు ఎమ్మెల్యేగా, ఒక మారు ఎమ్మెల్సీగా పనిచేశారు. ఆయన చాలాసార్లు మంత్రిగా కీలకమైన బాధ్యతలను నిర్వహించారు. ఇక దాడి వీరభద్రరావు మీద ఒక్క ఒకే ఒక మచ్చ ఏంటి అంటే ఆయనలో రాజకీయ నిలకడ లేదని, నిజానికి రాజకీయ ఆరంగేట్రం చేసినప్పటి నుంచి 2012 వరకూ దాడి టీడీపీనే అట్టిపెట్టుకుని ఉన్నారు. కొత్త పార్టీలు ఎన్ని పుట్టినా కూడా ఆయన ఆ వైపు కూడా కన్నెత్తి చూడలేదు. అంతగా నమ్మితే, చంద్రబాబు మరోసారి ఎమ్మెల్సీ ఛాన్స్ ఇస్తానని చెప్పి కూడా ఇవ్వకుండా మాట దాటేశారు. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన ఆయన టీడీపీ నుంచి బయటకు వచ్చారు. ఆ ఆవేశంలోనే ఆయన వైసీపీలో చేరారు. దానికి తగిన ప్రతిఫలం కూడా పొందారు. కొడుకు రత్నాకర్ కి వైసీపీ తరఫున 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ సంపాదించుకున్నారు. కానీ కుమారుడు ఓడిపోయాడు. దాంతో దాడి వీరభద్రరావు మళ్లీ వైసీపీ నుంచి బయటకు వచ్చారు. ఆ తరువాత టీడీపీలో చేరేందుకు యత్నించారు. ఇక మరో మారు ఎన్నికల వేళ వైసీపీ కండువా కూడా కప్పుకున్నారు. ఇలా దాడి వీరభద్రరావు అటూ ఇటూ తిరగడం వల్ల ఇమేజ్ కొంత దెబ్బ తింది.

dadi veerabadrarao

Ys jagan : ఎమ్మెల్సీ దక్కేనా ?

ఇక 2019 ఎన్నికల వేళ వైసీపీలో చేరినా టికెట్ దక్కలేదు. మరో వైపు చూస్తే వైసీపీకి పవర్ దక్కినా నామినేటెడ్ పదవి కూడా దాడి వీరభద్రరావుకి చిక్కలేదు. దాంతో దాడి విసిగి ఏడాదిగా పూర్తిగా వైసీపీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే జగన్ ఈ మధ్య గుర్తు పెట్టుకుని మరీ పాత కాపులకు ఎమ్మెల్సీ పదవులు ఇవ్వడంతో ఆయనకు మళ్లీ ఆశ పుట్టిందట. రానున్న రోజుల్లో ఎమ్మెల్సీ పదవులు ఖాళీ అవుతుండడంతో దాడి మళ్లీ యాక్టీవ్ అవుతున్నారట. ఇప్పటిదాకా శాసన మండలి ఉంటుందో ఉండదో అన్న డౌట్ లో పడిన ఆయనకు ఇక అది కంటిన్యూ అవుతుంది అన్న భరోసా కూడా దక్కడంతో మళ్లీ మీడియా ముందుకు వస్తున్నారు. అయితే దాడి వీరభద్రరావు అంటే జగన్ కి కూడా గౌరవం ఉంది. అందుకే ఆయన తనను గతంలో ఘాటుగా విమర్శించినా కూడా మళ్ళీ పార్టీలో చేర్చుకున్నారు. అయితే దాడి వీరభద్రరావు కోరినట్లుగా ఆయనకు ఎమ్మెల్సీ పదవిని జగన్ ఇస్తారా అన్నదే ఇక్కడ హాట్ టాపిక్ కు తెరలేపింది. టీడీపీ నుంచి వచ్చిన చాలామంది పాత కాపులు .. వైసీపీలో సైలెంట్ గానే ఉన్నారు. అదే తరహాలో ఒక్క ఓటమితో తనను పక్కన పెట్టేయడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యారు.

చంద్రబాబుకు చెక్ పెట్టవచ్చా ?

సీనియర్ లీడర్లను, వయసు రీత్యా పెద్దవాళ్ళను జగన్ పక్కన పెడుతున్నారు. కానీ దాడి లాంటి వారి సీనియర్ల సేవలను కేవలం పార్టీ వరకే వాడుకోవాలని జగన్ ఆలోచిస్తున్నారని టాక్.. అయితే దాడి వీరభద్రరావుకి మంచి వాగ్దాటి ఉంది. పైగా చంద్రబాబును చెడా మడా తిట్టే దమ్మూ ధైర్యం కూడా ఉన్నాయి. బాబు లోగుట్టు బాగా తెలిసిన వారు కూడా. అందువల్ల దాడి సేవలు పెద్దల సభకు అవసరం అనుకుంటే జూన్ లో స్థానిక సంస్థల కోటాలో ఖాళీ అయ్యే స్థానాలలో ఒక ఎమ్మెల్సీ పదవిని కేటాయించవచ్చన్న ప్రచారం సాగుతోంది. ఈ లిస్ట్ లో చాలా మందే ఉండడంతో, ఎవరికి ఛాన్సిస్తారన్నదే హాట్ టాపిక్ గా మారిందట. సీనియర్లున్నా, మంచి వాగ్ధాటి ఉన్న నేతల్లో దాడి ఒకరన్నది విశ్లేషకుల వాదన. ఆయనకు వాయిస్ ఇస్తే, ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉన్న టీడీపీకి మరింత చెక్ పెట్టవచ్చని వీరు భావిస్తున్నారు. మరి దాడి వీరభద్రరావు విషయంలో జగన్ నిర్ణయం ఏమై ఉంటుందో మాత్రం వేచి చూడాల్సిందే.

brahma

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది