Jana Reddy : నేను ప్రాణం పోసిన వాళ్లే నన్ను చంపాలనుకుంటున్నారు… జానారెడ్డి సంచలన వ్యాఖ్యలు..?
Jana Reddy : కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నాగార్జునసాగర్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుపున జానారెడ్డి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. సాగర్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా.. తాజాగా హాలియాలో కాంగ్రెస్ బహిరంగ సభను నిర్వహించింది. ఈసందర్భంగా మాట్లాడిన జానారెడ్డి… తెలంగాణ ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు.
Jana Reddy : తెలంగాణ రాష్ట్రం కోసం మా పదవులనే త్యాగం చేశాం
కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది… అని అంటున్నారు కదా.. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రం కోసం మేము మా పదవులను త్యాగం చేశాం. నాగార్జునసాగర్ ప్రాజెక్టును కట్టింది కాంగ్రెస్ పార్టీ. సాగర్ ప్రాజెక్టు ద్వారా ఆరున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది. కాంగ్రెస్ పార్టీ రైతులకు వరంగా మారింది. ఇలా.. చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సాగర్ అభివృద్ధి చెందిందే కాంగ్రెస్ పార్టీ వల్ల. గిరిజనుల కోసం అటవీ హక్కులను తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ.. భూపరిహార చట్టాలన్ని అమలు చేసింది కాంగ్రెస్ పార్టీ.. అంటూ జానారెడ్డి ఈసందర్భంగా వెల్లడించారు.
Jana Reddy : వీళ్లకు ఎమ్మెల్యేలు కాదు.. సర్పంచ్ లు అయ్యే అర్హత కూడా లేదు
కాంగ్రెస్ పార్టీలో చేరి.. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచి… తర్వాత అమ్ముడుపోయి.. కాంగ్రెస్ పార్టీనే ఇప్పుడు ఎదిరిస్తున్నారు. వీళ్లు ఎమ్మెల్యేలు కాదు.. సర్పంచ్ లు కూడా అయ్యే అర్హత లేదు. ఓవైపు ప్రభుత్వం ఫిరాయింపులను ప్రోత్సహిస్తోంది. నాయకులు ఫిరాయింపులకు పాల్పడి… కన్నతల్లి లాంటి పార్టీని తలదన్ని అమ్ముడుపోయారు. నేను ప్రాణం పోసిన వాళ్లే నన్ను చంపాలనుకుంటున్నారు. ఇటువంటి నాయకులా కావాల్సింది మనకు. వీళ్లకు సరైన బుద్ధి చెప్పాల్సింది మీరే. కాంగ్రెస్ పార్టీకి విఘాతం కలిగిస్తున్న ఇటువంటి నాయకులకు గుణపాఠం చెప్పడమే కాదు… ప్రజాస్వామ్యాన్న వమ్ము చేస్తూ.. పశువుల్లాగా అమ్ముడుపోతూ ఫిరాయింపులకు ప్రోత్సహిస్తున్న ప్రభుత్వాన్ని కూడా ఓడించాలి.. అని జానారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే… ఎవ్వరూ ప్రచారం చేయకండి. టీఆర్ఎస్ వాళ్లు ప్రగత్ భవన్ లో ఉండండి… నేను గాంధీ భవన్ లోనే ఉంటా… బీజేపీ నేతలు వాళ్ల ఆఫీసులో ఉండండి. ఇప్పుడు ఎన్నికలు పెడదాం. ఈ సవాల్ కు అందరూ సిద్ధమా? అంటూ జానారెడ్డి సవాల్ విసిరారు.
నాగార్జునసాగర్ ను బాగు చేసిందే నేను. ఇప్పుడు మేం అభివృద్ధి చేశాం అని చెప్పుకుంటున్న గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల కన్నా నాగార్జునసాగర్ ను ఎప్పుడో నేను అభివృద్ధి చేశా. నా అభివృద్ధి గురించి అడగడానికి నీకు హక్కు లేదు. నేను ప్రశ్నిస్తే… ఇండ్లు కట్టడం ఆపేస్తారా? ఇలాంటి మీరు ప్రభుత్వాన్ని ఎలా నడిపిస్తారు. నన్ను ప్రశ్నించే ఎమ్మెల్యేలు… వాళ్ల నియోజకవర్గాల్లో ఎన్ని ఇండ్లను కట్టారో చెబుతారా? అంటూ జానారెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.