Prabhas Kalki : కల్కి అసలు కథ ఇదే – ప్రాజెక్ట్ K లో ఏం చూపిస్తారో మరి !
Prabhas Kalki : ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ ప్రాజెక్ట్ కే సినిమాతో బిజీగా ఉన్నారు. తాజాగా ఈ సినిమాకి ‘ కల్కి 2898AD ‘ అని నామకరణం చేశారు. ఇటీవల ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్ విడుదల అయ్యాయి. అయితే ఈ గ్లింప్స్ చూసినప్పటినుంచి అందరిలో చాలా సందేహాలు వస్తున్నాయి. ఈ సినిమాకి కల్కి అని ఎందుకు పేరు పెట్టారు. అసలు కల్కి ఎవరు, ఆయన అవతారం ఎప్పుడు మొదలవుతుంది అని డౌట్స్ చాలా మందికి వస్తున్నాయి. పురాణాల ప్రకారం విష్ణుమూర్తికి చాలా అవతారాలు ఉంటాయి. ఒక్కో యుగానికి ఒక్క అవతారం ఎత్తి దుష్ట సంహారం చేస్తాడు.
అలాంటి అవతారాల్లో కల్కి అవతారం ఒకటి. అయితే ఇప్పుడు మనం ఉంటున్న కలియుగంలోనే కల్కి అవతరించనున్నాడు. భూమిపై పాపాలు పెరిగినప్పుడు విష్ణుమూర్తి కల్కి అవతారం ఎత్తనున్నాడు. కల్కి శంబల అనే గ్రామంలో విష్ణుయశస్సు అనే బ్రాహ్మణుడి ఇంట జన్మిస్తాడట. వీర ఖడ్గం ధరించి, తెల్ల గుర్రంపై స్వారీ చేస్తూ, దుష్టసంహారం చేసి సత్య యుగాన్ని స్థాపిస్తాడని చెబుతారు. కలక అంటే దోషం తొలగించేది అని అర్థం. దోషాన్ని హరించే అవతారం గనుక కల్కి అనే పేరు వచ్చిందని పండితులు చెబుతున్నారు. కలియుగంలో పాపం పెరిగినప్పుడు విష్ణు కల్కి అవతారం ఎత్తి దుష్ట సంహరణ చేస్తాడని పురాణాలలో ఉంటుంది.
ఇప్పటివరకు విష్ణువు 9 అవతారాలు ఎత్తారు. రామావతారం తర్వాత కృష్ణుడి అవతారం ఎత్తుతాడు. ద్వాపర యుగంలో కృష్ణుడు చనువు చాలించిన తర్వాత కలియుగం ప్రారంభం అవుతుంది. ప్రస్తుతం కలియుగం నడుస్తుంది అంటే ఈ కాలంలో కల్కి అవతారం ఎత్తే అవకాశం ఉంటుంది. అయితే శంబల అనే గ్రామం ఎక్కడ ఉందో ఇప్పటివరకు ఎవరికీ తెలియకపోవడం విశేషం. ఆ గ్రామం గురించి తెలుసుకోవడానికి చాలామంది చాలా ప్రయత్నాలు చేశారు. అయితే ఈ గ్రామం కేవలం పుణ్యాత్ములకు మాత్రమే కనబడుతుంది అనే నానుడి కూడా ఉంది. మరి కొందరేమో హిమాలయాల్లో ఈ గ్రామం ఉండి ఉండొచ్చు అని అంటున్నారు. ఇప్పుడు ఈ కల్కి ప్రస్తావనను ప్రాజెక్టు కే సినిమాలో తీసుకువచ్చారు. మరి ఈ సినిమాలో ప్రభాస్ కల్కిగా దుష్ట సంహారం ఎలా చేస్తాడో చూడాలి.