CCA : పొరుగు శరణార్థులకు భారత పౌరసత్వం.. ప్రధాన నిబంధనలు ఏమిటో తెలుసా..?
ప్రధానాంశాలు:
CCA : పొరుగు శరణార్థులకు భారత పౌరసత్వం.. ప్రధాన నిబంధనలు ఏమిటో తెలుసా..?
CCA : సార్వత్రిక ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పౌరసత్వ సవరణ చట్టం 2019ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ మేరకు సోమవారం సాయంత్రం హోంమంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది. 1955 పౌరసత్వ చట్టానికి సవరణలు చేయడం ద్వారా, కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. 2019 డిసెంబర్‌లో ప్రతిపక్షాల నిరసన మధ్య సీఏఏ బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. ఆవెంటనే దీనికి రాష్ట్రపతి ఆమోదం కూడా లభించింది. 2020 జనవరి 10న నిబంధనలను నోటిఫై చేశారు. కానీ, పూర్తి నిబంధనలపై సందిగ్దత నెలకొనడంతో ఈ చట్టం అమలు కార్యరూపం దాల్చలేదు. పైగా దేశవ్యాప్తంగా ఆందోళనలు నెలకొనడంతో కేంద్రం దీనిపై తాత్కాలికంగా వెనకడుగేసింది. లోక్‌సభ ఎన్నికల ముందే దీన్ని అమల్లోకి తీసుకొస్తామని ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పలుమార్లు ప్రస్తావించిన నేపథ్యంలో తాజాగా నోటిఫికేషన్ జారీ అయింది. సీఏఏ తాజా నోటిఫికేషన్ ప్రకారం, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్తాన్ నుంచి వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థులు ఈ చట్టం పరిధిలోకి వస్తారు. వారివద్ద తగిన పత్రాలు లేకపోయినా వారికి సత్వరం పౌరసత్వం ఇవ్వడానికి వీలు కలుగుతుంది. ఇందుకు 2014 డిసెంబర్ 31వ తేదీని కటాఫ్‌గా నిర్ధారించారు. ఈ తేదీ కంటే ముందు పై మూడు దేశాల నుంచి మనదేశానికి వలస వచ్చిన ఆరు మైనారిటీ కమ్యూనిటీలు హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలకు భారత పౌరసత్వం లభిస్తుంది. ఈ ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లో జరుగుతుంది. తాజాగా కేంద్రం నిబంధనలు నోటిఫై చేయడంతో తక్షణమే అమల్లోకి వచ్చినట్లయింది. ఇక వీరంతా భారత పౌరసత్వానికి దరఖాస్తు చేసుకోవచ్చన్న మాట. కేంద్రం ప్రకటనతో దాదాపు 30 వేల మంది శరణార్థులకు లబ్ది కలగనుంది.
గత 14 ఏళ్లలో కనీసం ఐదేళ్లు ఇక్కడే ఉంటున్న శరణార్థి పౌరులకు భారత పౌరసత్వం మంజూరు చేయబడుతుంది. ఇంతకు ముందు ఈ కాలవ్యవధి 11ఏళ్లుగా ఉండేది. ఇప్పుడు ఐదేళ్లకు తగ్గించారు. రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్‌లో చేర్చబడిన అసోంలోని కర్బీ ఆంగ్లోంగ్, మేఘాలయలోని గారో హిల్స్, మిజోరంలోని చక్మా జిల్లా, త్రిపురలోని గిరిజన ప్రాంతాల జిల్లాలకు ఈ చట్టం నుంచి మినహాయింపు కల్పించారు. 2019లో సీఏఏ చట్టం ఆమోదం తర్వాత ఈశాన్య ప్రాంతంతో సహా దేశంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నిరసనలు చెలరేగాయి. సీఏఏ అమలు నోటిఫికేషన్ నేపథ్యంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా భద్రత చర్యల్ని కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా దేశ రాజధానిలోని ఉత్తర, ఈశాన్య ఢిల్లీ ప్రాంతాలలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. భారీ సంఖ్యలో పారా మిలటరీ బలగాలను ఆయా ప్రాంతాలలో మోహరింప జేశారు. కాగా, ముస్లిం పౌరులెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని, తాజా నోటిఫికేషన్‌తో గాబరా పడొదన్ని ఇస్లామిక్ సెంటర్ ఆఫ్ ఇండియా విజ్ఞప్తి చేసింది. ప్రతి ఒక్కరూ సంయమనంతో ఉండాలి. దీనిపై మన లీగల్ బృందం కార్యాచరణ చేస్తుంది. తదుపరి నిర్ణయం వచ్చే వరకు మౌనంగా ఉండండి అని కోరింది.ఎలాంటి పత్రాలు లేకుండా దేశంలోకి ప్రవేశించిన వారు లేదా వీసా గడువు ముగిసినా దేశంలో ఉంటున్న వారిని అక్రమ వలసదారులుగా గుర్తిస్తారు. వీసా గడువు ముగిసినా, ఎలాంటి ధ్రువీకరణ పత్రాలకు లేకున్నా, ముస్లిమేతర శరణార్థులు దేశంలో నివసించడానికి అవకాశం కల్పిస్తూ పాస్‌పోర్ట్ అండ్ ఫారినర్స్ చట్టాలకు 2015లో కేంద్రం మార్పులు చేసింది.
పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్తాన్ లో హింసకు గురై మన దేశానికి శరణార్థులుగా వచ్చిన ముస్లిమేతరులకు పౌరసత్వం మంజూరు చేయడానికి ఉద్దేశించిన చట్టమే ఈ పౌరసత్వ సవరణ చట్టం. ఈ మూడు దేశాల నుంచి వలస వచ్చిన పౌరుల వద్ద తగిన పత్రాలు లేకున్నప్పటికీ, వారికి పౌరసత్వం కల్పించడానికి సీఏఏ అనుమతిస్తుంది. 2014 డిసెంబర్ 31 కంటే ముందు మన దేశంలోకి వచ్చిన వారు ఈ విధమైన పౌరసత్వ దరఖాస్తుకు అర్హులు. హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలకు ఈ పౌరసత్వ చట్టం వర్తిస్తుంది. ఈ మేరకు 1955 భారత పౌరసత్వ చట్టానికి సవరణలు తీసుకొచ్చారు.సీఏఏ చట్టంలో పొరుగు దేశాల వలసదారులకు భారత పౌరసత్వం మంజూరు చేసే విషయంలో ముస్లింలను పక్కనబెట్టడాన్ని విపక్షాలు ఆక్షేపించాయి. ఈ చర్య ముస్లిం మైనార్టీలను అణచివేయడమేనని, వారి హక్కుల్ని కాలరాయడమేనని పేర్కొంటూ ఈ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ విధమైన వివక్షతో కూడిన చట్టం భారతదేశ లౌకిక సిద్ధాంతానికి, మైనారిటీ హక్కులకు విఘాతమని ఆరోపించాయి.
పౌరసత్వ సవరణ చట్టంలో ముస్లిమేతరులైన ఆరు మైనారిటీ సామాజిక వర్గాలకు పౌరసత్వం ఇచ్చేలా నిబంధనలు పొందుపరిచారు. ముస్లింల ప్రస్తావన లేకపోవడంపై కేంద్ర ప్రభుత్వం గతంలోనే వివరణ ఇచ్చింది. పొరుగుదేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్తాన్ ముస్లిం మెజారిటీ దేశాలు. సీఏఏ బిల్లు ఆయా దేశాలలో హింసకు గురైన శరణార్థులకు భారత పౌరసత్వం ఇవ్వడానికి సంబంధించినది. అందుచేత, ముస్లిం మెజారిటీ దేశాలలో ఆ పౌరులు హింసకు, వివక్షకు గురికావడం అనేది అర్ధంలేనిది. ఈ దేశాల్లో మైనారిటీలుగా ఉన్న హిందువులు, క్రైస్తవులు, జైనులు, బౌద్ధులు, సిక్కులు, పార్శీలు హింసను ఎదుర్కొన్న ఉదంతాలు ఉన్నాయి. అలాంటి హింసా పరిస్థితుల్నుంచి వారు భారత్‌లోకి వచ్చారు. అందుకే అలాంటి శరణార్థులకు పౌరసత్వం ఇవ్వడమే సవరణ చట్టం ముఖ్య ఉద్దేశ్యం అని పార్లమెంట్‌లో చర్చ సందర్భంగా అమిత్‌షా స్పష్టంచేశారు. సీఏఏ చట్టం అస్సాం అకార్డ్ నిబంధనలకు విరుద్ధంగా ఉంది. ఇది అస్సాం ఒప్పందాన్ని ఉల్లంఘిస్తుంది. 1971 మార్చి 24 కంటే ముందు అస్సాం రాష్ట్రంలోకి వలస వచ్చిన వ్యక్తులు మాత్రమే స్థానిక పౌరులుగా గుర్తించబడతారని అస్సాం అకార్డ్ స్పష్టం చేస్తుంది. సీఏఏ పౌరసత్వ చట్టంలో దీనికి భిన్నంగా వేరొక తేదీని కటాఫ్‌గా పే ర్కొన్నారు. పైగా ఇది అస్సాంలోని ఎన్‌ఆర్‌సీ గణన మొత్తం ప్రక్రియకు విరుద్ధంగా పరిగణించబడుతుంది.
CCA నాలుగేళ్ల జాప్యం ఎందుకు?
నిజానికి 2020లోనే ఈ చట్టాన్ని అమలు చేయాలని మోడీ ప్రభుత్వం సంకల్పించింది. కానీ ఓవైపు ఆందోళనలు తారాస్థాయికి చేరుకోవడం, అదే సమయంలో కరోనా మహమ్మారి తరుముకు రావడంతో చట్టం అమలుకు బ్రేక్ పడింది. 2019 లోక్‌సభ ఎన్నికల వేళ బీజేపీ మేనిఫెస్టోలోని ప్రధాన వాగ్దానాలలో ఇదొకటి. మళ్లి ఎన్నికలు వస్తున్నందున, మునుపటి హామీని ఎలాగైనా అమలు చేసి తీరాలని కొద్దికాలంగా భాజపా పెద్దలు నిర్ణయించారు. అందుకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకూడదనే యోచనతోనే సోమవారం అమల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. అప్పుడంటే కరోనా వచ్చి ఆగిపోయాం. ఈసారి ఎవరూ అడ్డుకోలేరు అంటూ ఇటీవల అమిత్‌షా ఘాటుగానే స్పందించారు. ఈ చట్టం విషయంలో కొందరు ముస్లింలను ఉద్దేశపూర్వకంగానే తప్పుదారి పట్టించారంటూ కాంగ్రెస్, టీఎంసీలను ప్రస్తావిస్తూ షా విమర్శలు చేశారు.
CCA విపక్ష పాలిత రాష్ట్రాలు సహకరిస్తాయా?
సీఏఏ బిల్లు విధివిధానాలను ప్రతిపక్షాలు గతంలోనే వ్యతిరేకించాయి. దాంతో ఈ బిల్లు వివాదాస్పదమైంది. అమలు చేయవద్దని దాదాపు అన్ని ప్రతిపక్ష పార్టీలు కేంద్రానికి సూచించాయి. దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగాయి. అయినా మోడీ ప్రభుత్వం విపక్షాల నిరసనల మధ్యే బిల్లును పార్లమెంట్‌లో ఆమోదించుకుంది. ఆవెంటనే రాష్ట్రపతి ఆమోదముద్ర కూడా పడింది. సీఏఏ చట్టరూపం దాల్చింది. అయినప్పటికీ పలు రాష్ట్రాలు దీనికి వ్యతిరేకంగా తమ తమ రాష్ట్ర అసెంబ్లిdలలో తీర్మానాలు చేశాయి. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, రాజస్థాన్, పంజాబ్, తదితర రాష్ట్రాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి ఈ చట్టాన్ని అమలు చేయబోమని స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ పరిణామాలు ఏవిధంగా ఉండబోతున్నాయన్నది ఆసక్తిగా మారింది.