బీజేపీని ఒడ్డుకు చేర్చే సత్తా జనసేనకు ఉందా.! తిరుపతి లో బల బలాలేంటి ? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

బీజేపీని ఒడ్డుకు చేర్చే సత్తా జనసేనకు ఉందా.! తిరుపతి లో బల బలాలేంటి ?

 Authored By brahma | The Telugu News | Updated on :3 April 2021,2:21 pm

తిరుపతి ఉప ఎన్నికల్లో గెలుపుపై బీజేపీ ఎన్నో ఆశలు పెట్టుకుంది. నాలుగు నెలలకు ముందు నుంచే ఎన్నికలకు కసరత్తు ప్రారంభించింది. దుబ్బాక, గ్రేటర్‌ హైదరాబాద్‌ ఫలితాలతో మరింత ఉత్సాహంగా ముందుకు కదిలింది. వ్యూహాత్మకంగా జనసేనతో జత కట్టింది. పట్టుపట్టి తిరుపతి సీటు దక్కేలా ఆ పార్టీని ఒప్పించింది. ఎన్నికల నిర్వాహకులు, పర్యవేక్షకులుగా రాజ్యసభ సభ్యులను, మాజీ మంత్రులను ఇన్‌చార్జిలుగా నియమించుకుంది. అన్నింటికి మించి ఉన్నత విద్యావంతురాలైన విశ్రాంత ఐఎఎస్‌ అధికారిణి రత్నప్రభను అభ్యర్థిగా బరిలోకి దింపింది. ఒక్కమాటలో చెప్పాలంటే తిరుపతి సీటుపై గతంలో కన్నా ఎక్కువ ఆశలు పెట్టుకుంది. సత్తా చాటుకోవడానికి సర్వశక్తులు ఒడ్డుతోంది. తిరుపతి పార్లమెంట్‌ చరిత్రను తిరగేస్తే ఇక్కడ ఆ పార్టీ బలహీనంగానే కనిపిస్తోంది. టీడీపీతో జతకట్టి పోటీ చేసినప్పుడు మినహా మరెప్పుడూ ఉనికి కనిపించలేదు.

bjp and janasena

1991 నుంచే బీజేపీ ఇక్కడి నుంచి పోటీ చేస్తోంది. 1999, 2004, 2014 ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేసింది. ఈ మూడు ఎన్నికల్లో టీడీపీ మద్దతుతో బీజేపీ అభ్యర్థులు పోటీ చేశారు. 1999లో బీజేపీ అభ్యర్థి వెంకటస్వామి గెలిచారు. ఈ మూడు ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి వచ్చిన ఓట్లను ఆ పార్టీ బలంగా చెప్పలేము. పై 3 కాక మిగిలిన ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థికి వచ్చిన ఓట్లు మాత్రమే బీజేపీ బలంగా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఒక్కఓటుతో వాజ్‌పేయి రాజీనామా సానుభూతితో 1998 ఎన్నికల్లో మాత్రం బీజేపీ అభ్యర్థికి లక్ష 78వేల ఓట్లు వచ్చాయి. మిగిలిన అన్నిసార్లు బీజేపీ అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతు అయ్యాయి. 1991 ఎన్నికల్లో 21 వేల 526, 1996లో 13 వేల 315, 2009లో 21 వేల 696 ఓట్లు మాత్రమే వచ్చాయి. 2019 ఎన్నికల్లో బీజేపీకి కేవలం 16 వేల 847 ఓట్లు మాత్రమే పడ్డాయి. ఆ ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన ఓట్ల శాతం కేవలం 1.6 శాతం మాత్రమే.

బీజేపీకి మిత్రపక్షమైన జనసేన బలానికి వస్తే పార్లమెంట్‌ సెగ్మెంట్‌ వ్యాప్తంగా పవన్‌ కళ్యాణ్‌కు అభిమానులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ప్రత్యేకించి తిరుపతి, శ్రీకాళహస్తిలో అభిమానంతో పాటు సామాజికవర్గ అంశం కూడా పవన్‌కు అనుకూలించేదే. అయితే అభిమానాన్ని ఓటుగా మలుచుకోవడంలో పవన్‌ కళ్యాణ్‌ వెనుకబడ్డారనే విషయం 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులకు వచ్చిన ఓట్లు చెబుతున్నా యి. సామాజికవర్గం, అభిమానం బలంగా ఉన్న తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో బలమైన అభ్యర్థిని బరిలోకి దించితేనే పది వేలకు మించి ఓట్లు రాలేదు.

బీజేపీ, జనసేన పార్టీల పట్ల జనంలో అభిమానం ఉన్నా, దానిని ఓటుగా మలుచుకునేందుకు, ఆ ఓటును పోలింగ్‌ బూత్‌ వరకు నడిపించేందుకు అవసరమైన యంత్రాంగం లేదని, క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణం జరగని కారణంగానే ఈ పరిస్థితి నెలకొందని తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణం తదితరాల్లో చిన్న చిన్న లోపాలు ఉన్నా ఉపఎన్నికల నిర్వహణలో మాత్రం బీజేపీ పక్కాగా ముందుకు కదులుతోంది. అభ్యర్థి ఎంపికతోనే సగం విజయం సాధించామని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. మరి ఈ దఫా ఎన్నికల్లో ఏమేరకు ఓట్లు సాధిస్తారో వేచి చూడాల్సిందే.

brahma

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది